ఆస్ట్రేలియాకు పెద్ద షాక్‌

ఆస్ట్రేలియాకు పెద్ద షాక్‌ ఆస్ట్రేలియాకు పెద్ద షాక్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో కీలక నాకౌట్‌ దశ ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ ఎల్లిసీ పెర్రీ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో కీలకమైన సెమీ ఫైనల్‌కు ముందు ఆ జట్టు ప్రధాన క్రికెటర్‌ను కోల్పోయింది. 2009లో మహిళల ప్రపంచకప్‌ మొదలైన నాటి నుంచి ఎల్లిసీ ఆసీస్‌ తరఫున ప్రతీ టోర్నీ తప్పకుండా ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌-ఎలో సోమవారం న్యూజిలాండ్‌తో తలపడిన ఆఖరి లీగ్‌లో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఏడుస్తూనే మైదానాన్ని వీడింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున మెగా టోర్నీతో పాటు తదుపరి దక్షిణాఫ్రికా టూర్‌కు ఆమె దూరం కానుంది.

ఎల్లిసీపెర్రి కుడి కాలికి తీవ్రగాయమైందని, కొద్దికాలం ఆమె క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ జట్టు వైద్యుడు పిప్‌ ఇంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు ప్రపంచకప్‌లో ఎల్లిసీకి బదులు మరొకరిని రీప్లేస్‌ చేయబోమని ఆ జట్టు స్పష్టం చేసింది. ఆసీస్‌ తరఫున ఆమె కీలక క్రికెటర్‌ అని, దీర్ఘ కాలంగా జట్టులో కొనసాగుతోందని కోచ్‌ మాథ్యూమాట్‌ చెప్పాడు. ఎల్లిసీ స్థానంలో మరొకరిని తీసుకోబోమని, జట్టులో ఉన్న మిగతావాళ్లపై పూర్తి నమ్మకముందని ఆయన అన్నాడు. ఎల్లిసీ ఆటను భర్తీ చేసే సత్తా తమ జట్టులో ఉందన్నాడు.

సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ నాలుగు పరుగులతో విజయం సాధించింది. దీంతో గ్రూప్‌-ఎ నుంచి సెమీస్‌ చేరిన రెండో జట్టుగా నిలిచింది. అంతకుముందు టీమ్‌ఇండియా నాలుగు విజయాలతో సెమీస్‌ చేరింది. అలాగే గ్రూప్‌-బి నుంచి ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా నాకౌట్‌కు చేరాయి. ఈ రెండు జట్లూ మంగళవారం ఆఖరి లీగ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి సెమీస్‌లో ఏయే జట్లు తలపడతాయో స్పష్టం కానుంది.